కీసర ఎమ్మార్వో కేసులో ఏసీబీకి ఇచ్చిన మూడు రోజుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులు వేరువేరుగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. అయితే విచారణలో ఏసీబీ అధికారులకు తహసీల్దార్ నాగరాజు ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. బ్యాంక్ లాకర్ల విషయంలోనూ నోరు మెదప లేదని చెబుతున్నారు. బినామీ ఆస్తులపై తాను చేసిన అక్రమాల పై ఏసీబీ కి పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని కూడా ఏసీబీ ప్రశ్నించింది.
ఇక కోటి పది లక్షల రూపాయల లావాదేవీల మీద శ్రీనాథ్ స్పష్టత ఇచ్చాడు. 90 లక్షల రూపాయలు వరంగల్లోని మిత్రుల దగ్గర హ్యాండ్ లోన్, 20 లక్షల రూపాయలు హైదరాబాద్లో ఉన్న మరొక మిత్రుడు దగ్గర తీసుకున్నట్లు తెలిపాడు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపనుంది ఏసీబీ కోర్ట్. ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లు పై విచారణ జరిపామని, ఆంజిరెడ్డి ఆ డాక్యుమెంట్లు రేవంత్ రెడ్డి వే అని ఒప్పుకున్నాడని అన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ లో రేవంత్ రెడ్డి ప్రమేయం పై సాక్ష్యాలు లభించలేదని ఆయన అన్నారు. మరోసారి రేవంత్ రెడ్డి, అంజిరెడ్డి పత్రాలపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.