కశ్మీర్‌లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాలలో ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించారు జమ్ము కశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. భవిష్యత్‌లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. సినిమాల ప్రదర్శనతో పాటు ఇన్ఫోటెయిన్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమైన సినిమా హాళ్లు ఇవేనని చెప్పారు.
వీటితో పాటు వచ్చేవారం కశ్మీర్‌లో తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి. ఐనాక్స్ హాల్ ప్రారంభమైతే.. మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో నెలకొల్పిన మల్టీప్లెక్స్‌గా ఇది రికార్డుకెక్కనుంది.
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కలర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సమయంలో షమ్మి కపుర్ సాంగ్ గుల్మార్గ్లోని థియేటర్లలో హల్చల్ చేసింది. “చాహే కోయి ముఝే జంగ్లీ కహే” అని సాగే ఈ పాట అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ చిరునామాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి బాలీవుడ్ సినిమాల్లో కశ్మీర్ అందాలను అంతలా చూపించారు. అయితే కాశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగాక ఆ ట్రెండ్ కనుమరుగైపోయింది.
1980లో ఈ ప్రాంతంలో దాదాపు 12 థియేటర్లు ఉండేవని, ఉగ్రవాదుల బెదిరింపులతో ఈ హాల్స్‌ను మూసివేయాల్సివచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని థియేటర్లను పునః ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ 1999లో లాల్ చౌక్‌లోని రిగాల్ సినిమా థియేటర్‌పై గ్రెనేడ్ దాడి జరగడం వల్ల ఆ ఆలోచనను మానుకున్నారు. మరో రెండు థియేటర్లైన నీలమ్, బ్రాడ్వే తిరిగి ప్రారంభమైనప్పటికి జనాదరణ లేక వాటిని మూసివేయాల్సి వచ్చింది. ఇలా వరుస దాడులు జరిగినప్పటికి ఐనాక్స్ మాల్ తెరవడం పట్ల కశ్మీర్ లోయలోని చిత్రనిర్మాతలు, కళాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
A historic day for J&K UT! Inaugurated Multipurpose Cinema Halls at Pulwama and Shopian. It offers facilities ranging from movie screening, infotainment and skilling of youth. pic.twitter.com/QraMhHXSuN
— Office of LG J&K (@OfficeOfLGJandK) September 18, 2022