ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు త‌క్కువ సంఖ్య‌లో ఫ్యాన్స్‌ను అనుమ‌తించాలి

-

క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ 13వ ఎడిష‌న్ నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డ సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు ఐపీఎల్‌ను నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. టోర్నీ మొత్తం ఈ సారి దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో స్టేడియాల‌లో ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఐపీఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓన‌ర్ నెస్ వాడియా స్పందించారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు త‌క్కువ సంఖ్య‌లో ఫ్యాన్స్‌ను స్టేడియాల‌కు అనుమ‌తిస్తే బాగుంటుంద‌ని నెస్‌వాడియా అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ గ‌ల్ఫ్ మీడియా సంస్థ‌తో తాజాగా మాట్లాడారు. దుబాయ్‌లో అత్యాధునిక వ‌స‌తులు అందుబాటులో ఉన్నాయని, అందువ‌ల్ల కరోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ త‌క్కువ సంఖ్య‌లో ఫ్యాన్స్‌ను స్టేడియాల‌కు వ‌చ్చేందుకు అనుమ‌తిస్తే టోర్నీకి కొద్దిగైనా క‌ళ వ‌స్తుంద‌న్నారు. దుబాయ్‌లో అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ మ్యాచ్‌లు నిర్వ‌హించే వ‌స‌తులు ఉన్నందున బీసీసీఐ ఈ విష‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌న్నారు.

అయితే బీసీసీఐ ఆ నిర్ణ‌యం తీసుకున్నా.. యూఏఈ ప్ర‌భుత్వం మాత్రం అందుకు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 51 రోజుల పాటు టోర్నీ జ‌ర‌గనున్న నేప‌థ్యంలో అటు ప్లేయ‌ర్లే కాదు, ఇటు అంపైర్లు, సిబ్బంది ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐకి ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌డం ఒక స‌వాల్‌గా మార‌నుంది. ఇలాంటి ప‌రిస్థితిలో స్టేడియాలలోకి ఫ్యాన్స్‌ను అనుమ‌తిస్తారా, లేదా అన్న‌ది మరొక సందేహంగా మారింది. దీనిపై టోర్నీ జ‌రిగే వ‌ర‌కు స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version