దాదాపుగా 40 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగిన అనంతరం ఎట్టకేలకు దేశంలో మళ్లీ మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. దీంతో మద్యం ప్రియులు సోమవారం నుంచి మళ్లీ కిక్కు ఎక్కించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం షాపులను తెరిచేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. అయితే హర్యానా మాత్రం మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అక్కడ మద్యంపై కరోనా ట్యాక్స్ విధించనున్నారు.
కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో అనేక రంగాలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో నాగాలాండ్‌లో పెట్రోల్, డీజిల్‌పై కరోనా ట్యాక్స్ విధించారు. ఇక హర్యానాలో మద్యంపై కరోనా సెస్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వివరాలు వెల్లడించారు. మద్యంపై కరోనా ట్యాక్స్ విధించడం వల్ల తాము ఇన్ని రోజులూ కోల్పోయిన ఆదాయాన్నితిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే అక్కడ మద్యంపై సెస్ విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు ఏపీలో సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచింది. 25 శాతం మద్యం ధరలు పెరిగాయి. అక్కడ కరోనా లాస్ కాదు కానీ.. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలనుకుంటున్నారు కనుక.. మద్యం ధరలను ఏపీ సర్కారు భారీగా పెంచింది. దీంతో పెంచిన ధరల ప్రకారమే సోమవారం నుంచి మద్యాన్ని అమ్మనున్నారు. మరోవైపు తెలంగాణ మాత్రం ఇంకా రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మద్య అమ్మకాలను ప్రారంభిస్తే.. తెలంగాణలో కూడా మద్యం ధరలను పెంచడమో లేదా సెస్ విధించడమో చేస్తారని ప్రచారం సాగుతోంది..!