ఏపీలో పెరిగిన మద్యం రేటు చేస్తోన్న పని ఇది!!

-

పరిపాలనా సౌలభ్యం కోసం చూడటానికి రెండు రాష్ట్రాలు కానీ… ఏపీ – తెలంగాణలకు వేరు వేరు రాష్ట్రాలుగా పూర్తిగా చూడలేని పరిస్థితి! ఈ క్రమంలో ఒక వైపు మద్యానికి అడ్డుకట్టలేని పరిస్థితి.. మరోవైపు మద్యాన్ని ఎప్పుడెప్పుడు ఆపేద్దామ్మా అన్నట్లు చూస్తున్న పరిస్థితి! ఈ క్రమంలో సగటు మందుబాబుకు తెగ నొప్పి కలిగేస్తుంది! ఎందుకంటే… ధరల విషయంలో! అవును… తెలంగాణలో 100 నుంచి 120 రూపాయలు పెడితే వచ్చే మద్యం, ఏపీలో రూ. 180 – 200 అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే… సరైన మందు సరైన మోతాదులో కొంటే ఈ వ్యాత్యాసం వేలల్లో ఉంటుంది! దీంతో… తెలంగాణ మద్యంపై ఏపీ వాసులు తెగ బెమ పడుతున్నారని తెలుస్తోంది!

మద్యం దుకాణాలు తెరిచుకున్నాయి… నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో ఎలాగైనా మద్యం తాగాలని భావించిన సగటు మందుబాబుపై మొదటి వారంరోజులూ ధరల పట్టిక పెద్దగా ప్రభావం చూపించలేదు! ఎలాగైనా తాగాలని చాలామంది ధరలు ఎలా ఉన్నా మద్యం కొనుగోలుకు బారులు తీరారు. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ… మద్యం ధరల పెంపుపై పునరాలోచనలో పడ్డారు మందుబాబులు. ఎక్కడ తక్కువ ధర ఉందో అని వెతికి అక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు! ఇన్నాళ్లు వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు చూసిన ప్రజలకు ఇప్పుడు మందు కోసం ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏర్పడింది.

మద్యం దుకాణాలు రీ ఓపెన్ చేస్తూనే… ఏపీ ప్రభుత్వం 25 శాతం ధరలు పెంచేసింది. ఆ మరుసటి రోజే మరో 50 శాతం ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ధరలు పెంచడంతో షాక్ కు గురయిన మందుబాబులు ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్లారు. దీంతో పక్క రాష్ట్రం తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో… తెలంగాణకు రావడం మొదలుపెట్టారట! ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని మందుబాబులు తెలంగాణకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారనే చెప్పాలి!

ఏపీ తెలంగాణలకు సరిహద్దు రాష్ట్రాలు అవ్వడంతో… ఏపీలో ఉన్నవారు తెలంగాణలోకి వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ తీసుకెళ్తున్నారట! ఖమ్మం జిల్లాలోని మధిర – సత్తుపల్లి నియోజకవర్గాలకు ఏపీలోని కృష్ణాజిల్లా.. అశ్వరావు పేట నియోజకవర్గానికి పశ్చిమగోదావరి.. భద్రాచలం నియోజకవర్గానికి తూర్పుగోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లోని ప్రజలు చాలావరకూ ఖమ్మం జిల్లాలోని మద్యం దుకాణాలకు వచ్చి మందు కొనుక్కుని వెళ్తున్నారని తెలుస్తోంది!

ఇంతవరకూ పరిస్థితి ఇలా ఉంటే… రేపు లాక్ డౌన్ తెరిచిన తర్వాత పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రతీ ఊరిలో, దాదాపు 10 ఇళ్లకు ఒకరైనా హైదరాబాద్ లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబందం కలిగి ఉండటంతో పాటు… వారానికి ఒకసారో, నెలకు రెండు మూడు సార్లో హైదరాబాద్ కి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో… ఏపీ మోత్తం తెలంగాణ మద్యం ఏరులై పారే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!! ఈ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని పక్షంలో… ఏపీలో మద్యం విషయంలో జగన్ చేస్తున్న ఆలోచనలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news