బీహర్ రాజకీయాన్ని రసకందాయంలో పడేసిన చిన్న పార్టీ

-

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నాలుగు సీట్లైనా గెలుచుకోలేని ఒక చిన్న పార్టీ తారుమారు చేసిందా?. ఒక కూటమిగా పోటీ చేసిన రెండు పార్టీల్లో ఒకటి భారీ విజయం సాధించడానికి.. మరొకటి దారుణంగా దెబ్బ తినడానికి కారణమేంటి?. మహాకూటమి విజయావకాశాలను దెబ్బ తీసే వ్యూహంలో కమలం సంధించిన రామబాణం విజయ తీరాలకు చేర్చిందా…

తాను గెలవలేకపోయినా ప్రత్యర్థుల్ని భారీగా దెబ్బ తీస్తున్నాయి చిన్న పార్టీలు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఈ సత్యం నిరూపణ అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని శాసించింది లోక్‌జనశక్తి పార్టీ. 21 స్థానాల్లో ఆర్జేడీనీ, 18 స్థానాల్లో జేడీయూని, ఏడు చోట్ల కాంగ్రెస్‌ను చావు దెబ్బ కొట్టారు ఎల్జేపీ అభ్యర్థులు. ఎల్జేపీ అభ్యర్థులు చీల్చిన అగ్ర వర్ణాలు, ఎస్సీల ఓట్ల కారణంగా జేడీయూ భారీగా నష్టపోయింది. జేడీయూ పోటీ చేసిన 122 స్థానాల్లో సగానికి పైగా సీట్లలో ఓడిపోయింది.

లోక్‌జనశక్తి పార్టీ బీజేపీతో కలిసి ఉంటూనే.. జేడీయూ నుంచి విడిపోవడం వెనుక.. వ్యూహం ఏదైనా ఉందా అని తలలు బద్దలు కొట్టుకున్న వారికి సమాధానంగా కనిపిస్తున్నాయి ఎన్నికల ఫలితాలు. లోక్‌జనశక్తి భారీగా సీట్లు గెలవలేకపోయినా.. ప్రత్యర్థుల్ని దారుణంగా దెబ్బ తీసింది. ఒక రకంగా చెప్పాలంటే.. మహాకూటమి అధికారంలోకి రాకపోవడానికి.. నితీశ్ కుమార్ మరో ముఖ్యమంత్రి కాలేకపోయినా దానికి కూడా కారణం ఎల్జేపీనే.

గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన ఎల్జేపీ.. ఈసారి బీజేపీ- జేడీయూ కూటమి నుంచి వైదొలగింది. అది కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే వెళ్లిపోయింది. ఎల్జేపీ అభ్యర్థులు 137 సీట్లలో పోటీకి దిగారు. ఇందులో జేడీయూ పోటీ చేసిన 115 సీట్లు ఉన్నాయి. నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థుల విజయ అవకాశాల్ని దెబ్బ తీసింది.

చిరాగ్ పాశ్వాన్‌ లక్ష్యం నితీశ్ కుమారైనా… ఆయన మహా కూటమిని కూడా భారీగానే దెబ్బ కొట్టారు. గట్టిగా చెప్పాలంటే చిరాగ్ వల్ల జేడీయూ కంటే ఆర్జేడీ, కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయాయి. ఆర్జేడీ 21 స్థానాలు కాంగ్రెస్ 7 చోట్ల ఎల్జేపీ వల్ల దెబ్బ తిన్నాయి. ఎల్జేపీ మహా కూటమితో కలిసి ఉంటే.. ఈ కూటమికి 150కి పైగా స్థానాలు వచ్చి ఉండేవి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లింలు, దళితుల్లో చాలా మంది ఎల్జేపీకి ఓటు వేశారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత.. మొదట మహా కూటమి ఆధిక్యంలో కనిపించింది. ఆ తర్వాత ఎన్డీయే కూటమి పుంజుకుంది. 50 స్థానాల్లో అభ్యర్థుల మెజార్టీ మార్జిన్ వెయ్యి ఓట్ల కంటే తక్కువగా ఉండటానికి కారణం కూడా ఎల్జేపీనే. లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థులు భారీగా ఓట్లు చీల్చడం వల్ల మిగతా పార్టీలన్నీ నష్టపోతే బీజేపీ లాభపడింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టడం ద్వారా బీజేపీకి మేలు చేసినందుకు చిరాగ్ పాశ్వాన్‌కు కేంద్రంలో ఏదైనా పదవి దక్కుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version