దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటకలోని బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఇటీవల బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్‌ను మరో వారంపాటు పొడిగించాలని డిసైడ్ చేసింది.
రాష్ట్రములో సడలింపుల తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగడంతో బెంగళూరులో జూలై 14 నుంచి 23 వరకు కఠిన లాక్ డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. అయినా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బెంగళూరు మేయర్ గౌతం కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు గౌతంకుమార్ తెలిపారు. నగరంలో 2,000 కంటే ఎక్కువ కేసులు నమోదైన హాట్‌స్పాట్‌లు, కంటైన్మెంట్ జోన్‌లలో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మేయర్ చెప్పారు.