లాక్డౌన్ మన జీవితాలని చాలా మార్చివేసింది. ఒక్కసారిగా వచ్చిన ఉపద్రవం అతలాకుతలం చేసేసింది. ఎనిమిదిన్నర నెలల కిందట మొదలయిన ఉపద్రవం ఇంకా విజృంభిస్తూనే ఉంది. దీని కారణంగా రోజువారీ జీవితాల్లో ఎన్నో కొత్త పద్దతులు వచ్చేసాయి. అప్పటి వరకూ పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదని స్కూళ్ళలో చెప్పే ఉపాధ్యాయులే, చిన్నపిల్లలకి ఫోన్లో క్లాసులు చెబుతున్నారు. సామాజిక దూరం కారణంగా అన్నీ ఆన్ లైన్లోనే జరిగిపోతున్నాయి.
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ నుండి ఆన్ లైన్ టీచింగ్, ఆన్ లైన్ వర్క్, ఆన్ లైన్ థియేటర్లు మొదలు చాలా సౌకర్యాలు ఆన్ లైన్లోనే దొరుకుతున్నాయి. ఐతే తాజాగా ఒక జంట తమ వివాహ విందుని అతిధుల ఇంటికే పార్శిల్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. తమ బంధువులందరినీ ఆహ్వానించడానికి టైమ్ లేక, ఆన్ లైన్లో వారందరికీ వివాహా వేడుక జరుపుకున్న ఆ జంట, కళ్యాణ విందుని మాత్రం అతిధుల ఇంటికి పంపించి అందరికీ షాకిచ్చింది.
New trend of marriage invitation. Marriage food will be delivered at your doorstep. pic.twitter.com/ooEz1qbsvP
— Shivani (@Astro_Healer_Sh) December 10, 2020
దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆహ్వాన పత్రికను డిజైన్ చేయడం ఆసక్తికరం. ఆహ్వాన పత్రికలో భోజనానికి సంబంధించిన అన్ని వివరాలతో పాటు మా పెళ్ళి విందుని ఆరగించడంటూ చెప్పారు. రంగు రంగుల బాక్సుల్లో భోజనాన్ని చాలా అందంగా పార్శిల్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి వినూత్నమైన ఆలోచన చాలా బాగుందని ఒకరు, అరటాకు నిండా భోజనం చాలా బాగుందని మరొకరు. కరోనా తెచ్చిన మార్పుల్లో ఇదొకటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐడియా మీకూ వర్కౌట్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి.