దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. చాలా వరకు ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓ బూత్ నుంచి తమ ఏజెంట్ బిశ్వంత్ పాల్‌ను టీఎంసీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని బీజేపీ ఆరోపించింది.
ఇంకోవైపు మేదినీపుర్ నియోజకవర్గంలో రాళ్లదాడులు చోటు చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కూచ్‌బెహర్‌లో జరిగిన ఘటనల్లో ఇరువర్గాల కార్యకర్తలు గాయపడగా.. ఓ గ్రామంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కూచ్‌బెహర్‌లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఈ దశ పోలింగ్‌లో బెంగాల్ నుంచి ఈసీకి 100కు పైగా ఫిర్యాదులు అందాయి.
మరోవైపు మణిపుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో కాల్పులు వినిపించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇన్నర్ మణిపుర్, ఔటర్ మణిపుర్.. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది