ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (జూడా) ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధానమైన నాలుగు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యులు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఇక సెకండ్ వేవ్‌లోనూ తిండి, నిద్రకు దూరమై శ్రమించి మరీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించారని అన్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులే ముందుండి పోరాడుతున్నారని, పీజీ, హౌస్‌సర్జన్లు కూడా కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దశల వారీగా సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి తెలియజేసినా స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
జూడాల ప్రధానమైన డిమాండ్లయిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్య భీమా, మరణించేవారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలానే కోవిడ్ విధుల్లో వున్న పీజీలకు, హౌస్‌సర్జన్లకు కూడా కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని, వైద్యులు, సిబ్బందిపై దాడులు జరగకుండా ఆస్పత్రులలో భద్రత పెంచి రక్షణ కల్పించాలని, స్టైఫండ్ నుంచి టీడీఎస్ కటింగ్ పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. జూనియర్ డాక్టర్లు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని లోకేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.