ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఈ పది నెలల్లో తగిలిన అతిపెద్ద దెబ్బ లో ఒకటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవటం. ప్రకాశం జిల్లా నుంచి ఆయన బలమైన నేతగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. టీడీపీని వీడటం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద దెబ్బ. అయితే ఒకసారి ఆయన పార్టీ ఎందుకు మారారు అనే విషయాన్ని ఆరా తీస్తే పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాసంలో ఒక లంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అందరూ హాజరయ్యారు. అందులో కరణం బలరాం కుమారుడు ప్రకాశం జిల్లా యువ నేత కరణం వెంకటేష్ కూడా ఉన్నారు. కరణం వెంకటేష్ విషయంలో నారా లోకేష్ కాస్త దురుసుగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చీరాలలో మీ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు అద్దంకి రాజకీయాలతో సంబంధం ఎందుకు అని, అక్కడి గొట్టిపాటి రవికుమార్ ని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేరుగానే ప్రశ్నించినట్లు సమాచారం.
అదేవిధంగా అక్కడ స్థానిక నాయకులతో మంతనాలు జరపాలిసిన అవసరం ఏముంటుందని లోకేష్ కరణం వెంకటేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం పై అనేక అనుమానాలు ఉన్నాయని అక్కడి వ్యవహారాలను ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ చూసుకుంటారని అద్దంకి గురించి మీకు అనవసరం అని కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారట లోకేష్. వాస్తవానికి కరణం కుటుంబానికి అద్దంకి నియోజకవర్గం సొంత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో తనకు సన్నిహితంగా ఉండే నాయకులతో మాట్లాడితే తప్పేంటి అంటూ కరణం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.