అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎవరూ వెళ్లకపోతే బాగోదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ… చంద్రబాబుని ఆన్ లైన్ కి పరిమితం చేసి ఆయన పుత్రరత్నం చినబాబు గ్రౌండ్ లోకి దిగారు! ఈ సందర్భంగా ఒక్కో గ్రామంలో ఒక్కో మాట, ఒక్కో దీక్షా శిభిరంలో ఒక డైలాగ్ వేయడం అయితే వేశారు కానీ.. ఇంతకూ ఉద్యమం చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయాలపై కొన్ని చోట్ల క్లారిటీ ఇవ్వలేదు సరికదా కంఫ్యూజన్ లో పెట్టేశారు చినబాబు!
అవును… తాజాగా కృష్ణాయపాలెం, పెనుమాక మొదలైన “ఏపీ శాసన రాజధాని” ప్రాంతంలోని కొన్ని సెలక్టివ్ గ్రామాల్లో పర్యటించిన నారా లోకేష్.. అమరావతిలోని ఒక్క గడ్డిమొక్కనైనా జగన్ పీకలేరు వంటి పదాలు వాడి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినా… దీక్షలు చేస్తున్న కొంతమందిని మాత్రం కన్ ఫ్యూజన్ లో పెట్టారు! అదేమిటంటే… జగన్ అమరావతిని చంపేశారని!
నిజంగా అమరావతి అనే ఆలోచనను, భ్రమను జగన్ చంపేసి ఉంటే… ఇక ఉద్యమం చేయడం ఎందుకు… 50, 100, 200, 300 దినోత్సవాలు జరుపుకోవడం ఎందుకు? అనేది కొత్త ప్రశ్న! ప్రస్తుతం అమరావతి అనేది ఇంకా చనిపోలేదని, సజీవంగానే ఉందని రైతులు ఇంకా పోరాటాలు గట్రా చేస్తుంటే… సడన్ గా రంగంలోకి దిగిన లోకేష్… ఇలా జగన్ అమరావతిని చంపేశారని, అమరావతి చచ్చిపోయిందని చెప్పడంతో రైతుల్లో ఉన్న ఉత్సాహాన్ని, మహిళల్లో ఉన్న చిరు ఆశని కూడా చినబాబు చంపేస్తున్నారని కమెంట్లు పడుతున్నాయి!!
ఉద్యమం 300 రోజుకి చేరుకున్న సందర్భంగా రైతుల్లో ఆశలు నింపాల్సిన లోకేష్.. అమరావతి కోసం అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మరింత నమ్మకం, భరోసా ఇవ్వాల్సిన లోకేష్… ఇలా అంతా అయిపోయిందని చెబితే ఎలా అనేది మరికొందరి ప్రశ్న! అంటే… “ఇంక చాలు” అని రాజధాని ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు పరోక్షంగా చెప్పినట్లయ్యిందనేది మరో కామెంట్!! సరే ఏది ఏమైనా… చినబాబు ఇలా బయటకు వచ్చి రైతులకు చేసింది ఇదన్న మాట!!