టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ చేపట్టిన బంద్ నేపథ్యంలో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై ముఖ్యనేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రివ్యూ నిర్వహించడం జరిగింది. ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలపై యువనేత చర్చించడం జరిగింది. పార్టీ నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ మేరకు తదుపరి ప్రణాళికకు రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. బంద్‌కు మద్దతు ఇచ్చి నిరసనల్లో పాల్గొన్న జనసేన, సీపీఐ కార్యకర్తలకు లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు దౌర్జన్యాన్ని ఎదుర్కొని బంద్ నిరసనల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను యువనేత అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ నిరసనలను అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలు సమీపంలోని విద్యానగర్ క్యాంప్ సైట్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.