తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల పొత్తు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమైన తెలంగాణ తెదేపా, కాంగ్రెస్, సీపీఐ తెరాస ఓటమే లక్ష్యంగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, సీపీఐ ముఖ్యనేత చాడా వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల హక్కుల్ని కేసీఆర్ కాలరాస్తున్నారని, ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడనుందన్నారు. త్వరలోనే ఢిల్లీ వెల్లి రాష్ట్రపతిని కలిసి తెలంగాణలోని రాజకీయ పరిస్థితిని వివరిస్తామన్నారు. అవసరమైతే ముందస్తు పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మహా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.