పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సంచలన నిర్ణయాలను తీసుకుంటూనే వస్తోంది. మొదట్లో కనీస నగదు నిల్వ ఉంచని ఖాతాలపై పెద్ద ఎత్తున జరిమానా వేసింది. ఈ క్రమంలో అందరూ విమర్శించే సరికి మినిమం బ్యాలెన్స్ చార్జిలను తగ్గించింది. అయితే ఇప్పుడు తాజాగా ఎస్‌బీఐ మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనుంది. అదేమిటంటే…
ఎస్‌బీఐ కస్టమర్లు ఇకపై బ్యాంక్‌లో తమ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్ చేయాలంటే తామే నేరుగా బ్యాంక్‌కు వెళ్లి క్యాష్‌ను డిపాజిట్ చేయాలి. అంతేకానీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ లేదా ఇతరులతో క్యాష్ డిపాజిట్ చేయించకూడదు. ఎవరి ఖాతాల్లో వారే క్యాష్ వేసుకోవాలి. అయితే ఖాతాదారుడి సంతకంతో కూడిన లెటర్‌ను ఇస్తే ఇతరులు ఎవరైనా ఆ ఖాతాలో క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. ఇదే నిబంధనను ఎస్‌బీఐ త్వరలో అమలు చేయనుంది.
ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తుండగా, తమ నిర్ణయాన్ని ఎస్‌బీఐ సమర్థించుకుంటోంది. నోట్ల రద్దు సమయంలో చాలా మంది అకౌంట్లలో వారికి తెలియకుండానే పెద్ద ఎత్తున నగదు జమ అయిందని దీన్ని నియంత్రించేందుకే ఇలాంటి విధానాన్ని అమలులోకి తేనున్నామని ఎస్‌బీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేస్తేనే ఈ రూల్ వర్తిస్తుందని, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ఇది వర్తించదని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.