కరోనా వైరస్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంచబడిన వారికి స్టాంపులు వేయనున్నారు. వారి ఎడమ చేతి పిడికిలిపై స్టాంపులు వేయనున్నారు. ఈ క్రమంలో ఆ స్టాంపుపై వారిని ఎన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచిందీ.. తేదీతో సహా ముద్ర వేయనున్నారు. దీంతో క్వారంటైన్‌లో ఉంచబడిన వారిని సులభంగా గుర్తించవచ్చని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపె వెల్లడించారు. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలో ఇప్పటికే 39 కరోనా కేసులు బయట పడగా, దేశంలో ఈ రాష్ట్రం కరోనా కేసుల్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ముంబై సిద్దివినాయక టెంపుల్‌తోపాటు తుల్జాభవాని ఆలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మార్చి 31వ తేదీ వరకు అక్కడ స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తదితర జనసమ్మర్థ ప్రదేశాలను ఇప్పటికే మూసివేశారు. ఈ క్రమంలోనే కరోనా అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు వారికి స్టాంపులు వేయనున్నారు.
కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను ఇప్పటికే రూ.45 కోట్లను సీఎం ఉద్ధవ్ థాకరే మంజూరు చేశారు. ఇక అక్కడ జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 3 నెలల వరకు వాయిదా పడ్డాయి.