వైసీపీ మంత్రికి నాన్ లోక‌ల్ సెగ…‌!

-

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు ప్ర‌త్య‌ర్థుల నుంచి వ్య‌తిరేక‌త ఉంటుంది. లేదా పోటీ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వారుకూడా ప్ర‌త్య‌ర్థుల‌నే టార్గెట్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు వైసీపీలో మాత్రం సొంత పార్టీ నేత‌ల్లోనే ఒక‌రిపై ఒక‌రు కుమ్మ‌లాటలు పెట్టుకుంటున్నారు. పైగా మంత్రుల విష‌యంలోనూ సొంత పార్టీలో సెగ వ‌స్తుండ‌డంతో పార్టీ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప్ర‌తిప‌క్ష టీడీపీకి ఎంతో ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్ని చోట్లా వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇది నిజంగా టీడీపీకి స‌మ్మెట పోటే. వైసీపీకి భారీ గెలుపే..!

అయితే, ఈ హ‌వాను నిల‌బెట్టుకునేందుకు, టీడీపీ వైపునుంచి ప్ర‌జ‌ల‌ను సంపూర్ణంగా వైసీపీ వైపు మ‌ళ్లించుకునేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నించ‌డం మానేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీలో కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయి. ముఖ్యంగా పెనుకొండ నుంచి గెలుపు గుర్రం ఎక్కిన శంక‌ర‌నారాయ‌ణ విష‌యంలో ఈ అస‌మ్మ‌తి రోజురోజుకు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డం లేద‌ని అంటున్నారు. వాస్త‌వానికి శంక‌ర‌నారాయ‌ణ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ త‌రఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న ఇప్పుడు పెనుకొండ‌లో వైసీపీ నేత‌ల నుంచి స‌హ‌కారం అంద‌డం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.  మంత్రి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా ఆ పార్టీలోని కొందరు మండలస్థాయి నాయకులు గత కొంత కాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా గోరంట్లకు చెందిన  అసమ్మతి నేత గంపల రమణారెడ్డి పార్టీలోని తన వర్గంతో వేరు కుంపటి పెట్టారు. తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రి సోదరులపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.

ఇక‌, ఇది చిలికిచిలికి గాలివాన‌గా మారి.. మంత్రి అస‌లు లోక‌ల్ కాదు.. నాన్ లోక‌ల్‌ను తెచ్చి మా నెత్తిన రుద్దారు. అని నాయ‌కులు సైతం ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. అంటే అస‌మ్మ‌తి నేత‌ల‌తో చేతులు క‌లుపుతున్న నాయ‌కులు పెరుగుతున్నారు. మంత్రి శంక‌ర‌నారాయ‌ణపై ఈ అస‌మ్మ‌తి నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. ఆయ‌న ధ‌ర్మ‌వ‌రానికి చెందిన శంక‌ర‌నారాయ‌ణ పెనుకొండ నుంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కురాని వ్య‌తిరేక‌త వెనుక‌.. స్థానికంగా ఆయ‌న ఎవ‌రికీ అందుబాటులో లేక‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది.

పైగా స్థానికంగా నేత‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఆయ‌న ఎప్పుడు పార్టీలో ఉంటారో.. వెళ్తారో.. ఎప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి పోతారో.. అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల నుంచి మంత్రి శంక‌ర‌నారాయ‌ణ ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version