తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకుని ఉండే యానాం.. పుదుచ్చేరిలో భాగమైనా.. ఇక్కడి రాజకీయాలపై తెలుగువారికి ఆసక్తి ఎక్కువే. ఈ ప్రాంతం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేసిన మల్లాడి కృష్ణారావుకు.. ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అలాంటి మల్లాడి.. యానాం రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీని వెనక ఉన్న వ్యూహం పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
అప్పటి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడీతో వచ్చిన విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం రేపారు మల్లాడి. ఏపీ వచ్చేసి ఏ పదవీ ఆశించకుండా సీఎం జగన్‌తో కలిసి పనిచేస్తానని చెప్పి కొత్త చర్చకు దారితీశారు. ఇంతలో కిరణ్‌బేడీని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించడంతో ఆయన మనసు మార్చుకున్నారట. దాంతో రాజకీయంగా మల్లాడి కొత్త అడుగులు వేస్తున్నారనే టాక్ మొదలైంది.
మల్లాడి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కిరణ్ బేడీని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించడంతో కేంద్ర హోమంత్రి అమిత్‌షాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరిందట. అంతేకాదు.. బీజేపీ మల్లాడిని రాజ్యసభకు పంపుతుందని.. దానికి ప్రతిఫలంగా పుదుచ్చేరి బీజేపీ కూటమి సీఎం అభ్యర్థి రంగస్వామిని యానాం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యతను ఆయన తీసుకుంటారని చెబుతున్నారు. ఈ మేరకు మాటలు అయినట్టు టాక్. రానున్నరోజుల్లో యానాంలో అద్భుతాలు జరుగుతాయంటూ ఈ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి.
మల్లాడికి కూడా పార్లమెంట్‌కు వెళ్లాలనేది చిరకాల కోరికట. అప్పట్లో లోక్‌సభకు పోటీ చేయాలని ప్రయత్నించినా రాజకీయ పరిస్థితులు అనుకూలించలేదట. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో ఎంపీ కావాలన్న ఆయన కల నేరవేరబోతున్నట్టు మల్లాడి అనుచరులు సంబరపడిపోతున్నారట. ప్రస్తుతం పుదుచ్చేరిలో పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్, డీఎంకే ఒక కూటమిలో ఉంటే.. బీజేపీ, అన్నాడీఎంకే, ఎన్‌ఆర్ కాంగ్రెస్ మరో కూటమి కట్టాయి. వీటిని అనుకూలంగా మల్చుకుని కాషాయ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట మల్లాడి.