మల్లన్న సంచలన నిర్ణయం..మొగ్గు అటు వైపేనా ?

-

తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం గళం విప్పుతూనే ఉంటారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై గట్టిగానే పోరాడతారు. అలాగే రాజకీయ విశ్లేషకుడుగా కూడా మల్లన్నకు అనుభవం ఉంది. ఇక సొంతంగా ఒక టీం పెట్టుకుని మల్లన్న కూడా రాజకీయంగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆ మధ్య జరిగిన నల్లగొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు టీఆర్ఎస్‌ని ఓడించినంత పనిచేశారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

అయితే చివరిలో టీఆర్ఎస్‌కు మెజారిటీ రావడంతో విజయం సాధించింది. ఇక అలా టీఆర్ఎస్‌కు చెమటలు పట్టించిన మల్లన్న అప్పటినుంచి హైలైట్ అవుతూనే వస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనపై పలు కేసులు నమోదు కావడం, వరుసపెట్టి అరెస్ట్‌లు కావడం జరిగాయి. అయితే ఇదంతా టీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ మల్లన్నని అరెస్ట్ చేయించిందనే ఆరోపణలు కూడా ఊన్నాయి.

ఇక ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన మల్లన్న…టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి రోజున జైలులో పాత నేరస్థులతో తనని చంపాలని కుట్ర పన్నగా, చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలిపారు. అలాగే మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని యత్నించినట్లు ఆరోపించారు.

ఇక తనను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మాట వాస్తవమేనని చెప్పిన మల్లన్న.. భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా.. కొత్త పార్టీ పెట్టడం, ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం లేదా పాత పద్ధతిలోనే కొనసాగడం…అది కాదంటే ఇతర పార్టీలో చేరడం వంటి నాలుగు అంశాలపై తన టీంతో సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారు.

అయితే ఈ చర్చల్లో పార్టీ పెట్టడం కంటే…బయట నుంచి వేరే పార్టీకి మద్ధతు ఇవ్వడమా లేక వేరే పార్టీలో చేరడమా అనేది ఎక్కువ చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చాయి…అలాంటప్పుడు కొత్తగా పార్టీ పెట్టడం వల్ల ఇప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు..పైగా ఓట్లు చీల్చినట్లు అవుతుంది. అందుకే బయటనుంచి వేరే పార్టీకి సపోర్ట్ ఇస్తేనే బెటర్ అని మల్లన్న యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే జరిగితే మల్లన్న, బీజేపీకే మద్ధతు ఇస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి మల్లన్న నిర్ణయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version