ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి అందులో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని, దీన్ని తాము అవమానంగా భావిస్తున్నట్లు మమతా చెప్పారు. కాగా ప్రధాని మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
అయితే ఈ సమావేశం పట్ల మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె మండిపడ్డారు. ఈ భేటీలో ప్రధానితో పాటు కేవలం కొందరు ముఖ్యమంత్రులు చిన్న చిన్న ప్రసంగాలు చేశారని, వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ కేసుల ప్రస్తావనే ప్రధాని తీసుకురాలేదని అన్నారు. మోదీ అభద్రతా భావానికి లోనవుతున్నారని, అందువల్లే తమను మాట్లాడనివ్వలేదని ఎద్దేవా చేశారు.
తనకు అవకాశమిస్తే టీకాల కొరత గురించి అడగాలనుకున్నానని అలానే తమ రాష్ట్రానికి మరిన్ని టీకాలు ఇవ్వాలని కోరాలనుకున్నట్లు మమతా చెప్పారు. కానీ మమ్మల్ని మాట్లాడనివ్వకుండానే సమావేశం ముగించారని మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసారు. సమావేశానికి పిలిచి తాము చెప్పేది వినకుండా అవమానించారని అన్నారు. కాగా ఇటీవలే మోదీతో ఫోన్ కాల్ లో అనంతరం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.ప్రధాని కేవలం తన మనసులో ఉన్న మాటల్ని మాత్రమే చెప్పారని, తాము అభిప్రాయాలను కూడా వింటే బాగుండేదని ట్వీట్ చేశారు