కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు ప్రజలు మూడు సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం. ఇలా చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అయితే దేశంలో చాలా మంది మాస్కులను ధరించడం లేదని, మాస్కులను ధరిస్తున్న వారిలో చాలా మంది వాటిని ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో సగం జనాభా అసలు మాస్కులనే ధరించడం లేదని తెలిపింది.
దేశంలో సగం జనాభా మాస్కులను ధరించడం లేదు. మాస్కులను ధరిస్తున్న వారిలోనూ 64 శాతం మంది నోటిని కవర్ చేస్తూ, 20 శాతం మంది గడ్డాన్ని కవర్ చేస్తూ మాస్కులను ధరిస్తున్నారు. కానీ వారు ముక్కు కూడా కవర్ అయ్యేలా మాస్కులు ధరించడం లేదు. ఇందువల్లే కోవిడ్ వ్యాప్తి పెరుగుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ రాకుండా అడ్డుకోవాలంటే మాస్క్‌ను సరైన రీతిలో ధరించాలని చెబుతున్నారు.
మాస్కులను ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించాలి. మాస్క్ ధరించాక ఎలాంటి గ్యాప్స్ రాకూడదు. ప్రస్తుతం రక రకాల కోవిడ్ వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్నాయి కనుక డబుల్ మాస్క్‌లను ధరించాలి. ముందుగా సర్జికల్ మాస్క్‌ను, దానిపై క్లాత్ మాస్క్‌ను ధరించాలి. సర్జికల్ మాస్క్ లేకపోతే రెండూ క్లాత్ మాస్క్‌లను ధరించవచ్చు. అయితే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి.. అని అధికారులు తెలిపారు.