కేసీఆర్ రాకరాక బయటకొచ్చేసరికి అదొక వింతలా ఉంది

-

సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రి సందర్శనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం జూమ్ ద్వారా ఏర్పాటు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ గాంధీ ఆస్పత్రి సందర్శన ఒక పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో గంటసేపు హడావిడి చేసిన కేసీఆర్ అక్కడ సమస్యలు ఏమైనా తెలుసుకున్నారా? అని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు.

గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది లేరని అక్కడ వెంటిలేటర్లు పనిచేయడం లేదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించారా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకరాక బయటకు వచ్చేసరికి అందరికీ అదొక వింతలా ఉందని ఎద్దేవా చేసారు. ఏడేళ్ల పాలన ముఖ్యమంత్రి తొలిసారి బయటకు వచ్చి అదేదో గొప్ప విషయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.

గాంధీ ఆస్పత్రి సిబ్బంది తమ సమస్యలు చెప్పుకుంటుంటే వాటిని వినకుండా నేరుగా కలవమని సీఎం చెప్పినట్లు తెల్సిందని… మంత్రులకే సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండరు అలాంటిది ఉద్యోగులకు అందుబాటులో ఉంటరా..? అని ప్రశ్నించారు. సీఎం,వైద్య సిబ్బందికి 10 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఏడాదైందని దాని సంగతి ఇంతవరకు అతీగతీ లేదని అన్నారు. కనీసం డాక్టర్లు, వైద్య సిబ్బందికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇక కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కరోనా బారినపడి నిరుపేదలు ఆర్థికంగా అల్లాడుతున్నారని, కావున తక్షణమే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version