మ్యూజిక్ వింటూ బైక్‌పై వెళ్తున్నాడని.. ఫైన్ వేశారు..!

-

ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు చోట్ల అనవసరంగా ఫైన్ వేస్తున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా అసలు అవసరం లేకున్నా.. అనాలోచితంగా ఫైన్లు వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నూతన మోటారు వాహన చట్టం 2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. భారీ మొత్తంలో వారు జరిమానాలు కట్టాల్సి వస్తోంది. అయితే ఆ మాట అటుంచితే పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అనవసరంగా ఫైన్ వేస్తున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా అసలు అవసరం లేకున్నా.. అనాలోచితంగా ఫైన్లు వేస్తున్నారు. ఓ ఢిల్లీ వాసికి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

ఢిల్లీకి చెందిన రాఘవ్ స్వాతి పృథి అనే వ్యక్తి ఇటీవలే తాను నూతనంగా కొనుగోలు చేసిన హార్లే డేవిడ్‌సన్ రోడ్ గ్లయిడ్ స్పెషల్ టూ వీలర్‌ను నడుపుకుంటూ అక్కడి తిలక్‌నగర్ ఏరియాలో రోడ్డుపై వెళ్తున్నాడు. అయితే ఆ బైక్‌లో మ్యూజిక్ సిస్టమ్ కారు మాదిరిగా ఇన్‌బిల్ట్ వస్తుంది. ఈ క్రమంలోనే ఆ మ్యూజిక్ సిస్టమ్‌లో అతను తక్కువ స్థాయిలోనూ వాల్యూమ్ పెట్టుకుని పాటలు వింటూ వెళ్తున్నాడు.

అలా రాఘవ్ వెళ్తుండగా చూసిన ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపి వాహన పత్రాలు, తన లైసెన్స్ అన్నీ చూపించమన్నారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. అయినప్పటికీ అతను.. మ్యూజిక్ వింటూ బైక్ నడుపుతున్నాడని చెప్పి అతనికి ఫైన్ వేశారు. అయితే రాఘవ్ ట్రాఫిక్ పోలీసులతో వాదించాడు. మ్యూజిక్ సిస్టమ్ ఆ బైక్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తుందని, తానేమీ మోడిఫికేషన్ చేయించలేదని ఎంత చెప్పినా ట్రాఫిక్ పోలీసులు వినలేదు. దీంతో రాఘవ్ ఆ బైక్ కంపెనీ మాన్యువల్‌ను ప్రూఫ్‌గా చూపించి వివరించే ప్రయత్నం చేశాడు. అయినా పోలీసులు వినకుండా అతని బైక్‌ను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక అక్కడ రాఘవ్ మరోసారి వివరణ ఇచ్చేందుకు యత్నించినా అది కూడా ఫలించలేదు. దీంతో అతను చేసేదిలేక ఫైన్ కట్టి మరీ తన బైక్‌ను విడిపించుకున్నాడు. అవును మరి.. ఏం చేస్తాం.. అలాంటప్పుడు అంతా మన ఖర్మ.. అనుకుని ముందుకు సాగాల్సిందే.. చేసేదేమీ ఉండదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version