కండలు పెరగాలని 3 కిలోల వాజెలైన్‌ను ఎక్కించుకున్నాడు.. తర్వాత

-

రష్యాకు చెందిన కిరిల్ టెరెషిన్ అనబడే 23 ఏళ్ల యువకుడు చేతి కండలు (బైసెప్స్) ఉన్న పళంగా పెరగాలని అనుకున్నాడు. వెంటనే 3 కిలోల వాజెలైన్‌ను బైసెప్స్‌లోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించుకున్నాడు.

సాధారణంగా ఎవరైనా సరే చక్కని శరీరాకృతి, దేహదారుఢ్యం కావాలంటే.. నిత్యం వ్యాయామం చేయాల్సిందే. అలా కాకుండా కృత్రిమ పద్ధతిలో కండలు పెంచుకుందామంటే కుదరదు. కానీ ఇది ఆలోచించని ఆ యువకుడు అమాంతం, ఉన్న పళంగా కండలు పెరగాలని అనుకున్నాడు. ఇంకేముందీ.. అతను చేసిన ప్రయోగం వికటించింది.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కానీ చివరకు బతుకు జీవుడా.. అంటూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

రష్యాకు చెందిన కిరిల్ టెరెషిన్ అనబడే 23 ఏళ్ల యువకుడు బాడీ బిల్డర్. కానీ తాను ఆశించిన రీతిలో కండలు మాత్రం అతనికి లేవు. దీంతో చేతి కండలు (బైసెప్స్) ఉన్న పళంగా పెరగాలని అనుకున్నాడు. ఇంకేముందీ.. వెంటనే 3 కిలోల వాజెలైన్‌ను(పెట్రోలియం జెల్లీ) బైసెప్స్‌లోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించుకున్నాడు. దీంతో అమాంతం అతనికి బైసెప్స్ వచ్చాయి. అయితే అతని శరీరంలో ఉన్న వాజెలైన్‌ వల్ల అతని బైసెప్స్ వద్ద చర్మం, కండరాలు గట్టిపడి అతను తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఈ క్రమంలో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించగా వైద్యులు కష్టపడి 2 గంటల పాటు సర్జరీ చేసి అతని ఒక చేతి బైసెప్స్‌లో ఉన్న పెట్రోలియం జెల్లీని తీశారు. దీంతో కిరిల్‌కు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

అయితే కిరిల్ మరొక చేయిలో ఉన్న పెట్రోలియం జెల్లీని బయటకు తీసేందుకు ఇంకోసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అందుకు మరికొద్ది రోజులు పడుతుందని, అప్పటి వరకు అతను కొంత వరకు కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారు.. ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని, ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అవును మరి.. సహజ పద్ధతిలో కాకుండా కృత్రిమ పద్ధతిలో కండలు రావాలని చూస్తే.. ఇలాగే జరుగుతుంది మరి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version