రూ.5వేలకే ఐఫోన్ అంటే నమ్మాడు.. రూ.58వేలు నష్టపోయాడు..!

-

అత్యంత తక్కువ ధరలకే వస్తువులను అమ్ముతున్నామంటూ చెబుతున్న వారి చేతిలో కొందరు అడ్డంగా బుక్కవుతున్నారు. డబ్బులు నష్టపోతున్నారు.

బయట స్టోర్‌లలో కన్నా ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే మనకు ఎక్కువ రకాల స్మార్ట్‌ఫోన్ మోడల్స్ చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంత తక్కువ ధర అయినా.. మరీ భారీగా ధర తగ్గించి ఎవరూ అమ్మరు కదా. కానీ ఈ విషయం తెలియని కొందరు మోసగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అత్యంత తక్కువ ధరలకే వస్తువులను అమ్ముతున్నామంటూ చెబుతున్న వారి చేతిలో అడ్డంగా బుక్కవుతున్నారు. డబ్బులు నష్టపోతున్నారు. హైదరాబాద్‌లో తాజాగా ఇదే కోవకు చెందిన ఓ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన లెక్చరర్ మహమ్మద్ ఇస్లాంకు ఇటీవలే ఓ వ్యక్తి తాను అమెజాన్ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నానని, రూ.60వేల విలువైన ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌ను రూ.5వేలకే అందిస్తామని, అమెజాన్‌లో ఆఫర్ నడుస్తుందని చెప్పాడు. దాన్ని నిజమే అని నమ్మిన ఇస్లాం వెంటనే ఆ వ్యక్తి ఖాతాలో రూ.5వేలు జమ చేశాడు. అయితే జీఎస్టీ కోసం అదనంగా మరో రూ.12వేలు అకౌంట్‌లో వేయమని చెప్పగా, ఆ మొత్తాన్ని కూడా ఇస్లాం ఆ వ్యక్తి అకౌంట్‌లో వేశాడు. అనంతరం విడతల వారీగా మరికొంత సొమ్మును.. మొత్తం కలిపి రూ.58వేలను ఇస్లాం ఆ వ్యక్తికి పంపించాడు.

అయితే అప్పటికీ తనకు సొమ్ము రాలేదని ఆ వ్యక్తి చెప్పడంతో ఇదేదో మోసమని గ్రహించిన ఇస్లాం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఇలాంటి ఆఫర్లను ఎవరూ నమ్మవద్దని, అనవసరంగా డబ్బు నష్టపోవద్దని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version