మన దేశంలో సహజంగానే కొన్నిసార్లు ఈ-కామర్స్ సంస్థలకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ చీటింగ్ చేస్తుంటారు. దీంతో మనం ఆర్డర్ చేసే వస్తువులకు బదులుగా వేరే వస్తువులు వస్తుంటాయి. అయితే అక్కడ ఆ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. కానీ అక్కడ తక్కువ విలువ ఉన్న వస్తువులను ఆర్డర్ చేస్తే ఎక్కువ విలువ ఉన్న వస్తువు వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఇంగ్లండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన టెస్కో ఎక్స్‌ట్రా స్టోర్ నుంచి ఓ బ్యాగ్ యాపిల్ పండ్లను అక్కడి నిక్ జేమ్స్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఆర్డర్ చేశాడు. అయితే ఆ స్టోర్ వారు ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో అతను ఆర్డర్ చేసిన బ్యాగ్ యాపిల్ పండ్లకు బదులుగా స్టోర్ వారు అతనికి ప్రమోషన్ కింద ఒక ఐఫోన్ ఎస్ఈ ని పంపించారు.
ఆర్డర్ రాగానే జేమ్స్ సంచి తెరచి చూడగా అందులో యాపిల్ పండ్లకు బదులుగా యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఎస్ఈ వచ్చింది. దీంతో అతను మొదట కంగారు పడ్డాడు. కానీ కంపెనీ వారు ఫోన్ చేసి చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఆ స్టోర్ వారు ఏప్రిల్ 18వ తేదీ వరకు ఇలాగే తమ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా మొత్తం 80 మందికి ఇలా వారు ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా భిన్న రకాల విలువైన వస్తువులను అందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రమోషన్‌లో భాగంగా అలా విలువైన వస్తువులు వస్తే నిజంగా అదృష్టం వరించిందనే చెప్పాలి.