లైంగిక వేధింపులను అడ్డుకుందని రైల్లో నుంచి తోసేసి.. తానూ దూకి..

-

ప్రయాణిస్తున్న రైలులో మహిళపై లైంగిక వేధింపులకు ప్రయత్నించగా.. ఆమె అడ్డుకుంది. లైంగిక వేధింపులను అడ్డుకుందని ఆ మహిళను రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం హరియాణాలోని ఫతేబాద్ లో చోటుచేసుకుంది. మృతురాలిన మన్​దీప్ కౌర్​గా గుర్తించారు. మృతురాలి స్వస్థలం తోహానాలోని తూర్​నగర్​ అని పోలీసులు తెలిపారు.

మన్​దీప్ కౌర్ అనే మహిళ రోహ్​తక్​లోని ఖారెంటి గ్రామం నుంచి తన తొమ్మిదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని రైల్లో తోహానాకు వెళ్తోంది.  అయితే, తన తల్లిని ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడని మృతురాలి కుమారుడు తెలిపాడు. అతడిని మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఘర్షణ తలెత్తింది. దీంతో నిందితుడు మహిళను రైల్లో నుంచి బయటకు తోసేశాడు.

మన్​దీప్ కౌర్​ రాక కోసం తోహానా స్టేషన్​లో ఎదురుచూస్తున్న ఆమె భర్తకు.. కుమారుడు రైలు కోచ్​లో ఏడుస్తూ కనిపించాడు. జరిగిన విషయాన్ని కుమారుడు తన తండ్రికి వివరించాడు. దీంతో బాలుడి తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాత్రంతా వెతికినా మన్​దీప్ కౌర్ జాడ తెలియలేదు. శుక్రవారం ఉదయం మళ్లీ వెతకగా.. తోహానా రైల్వే స్టేషన్​కు 2కిమీ దూరంలో పొదల్లో పడిపోయి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తి సైతం రైలు నుంచి దూకేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి అగ్రోహా మెడికల్ కళాశాలలో చికిత్స కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version