బిడ్డ మృతదేహాన్ని మోస్తూ 8 కిలోమీటర్లు నడిచాడు..!

man walked with his daughter deadbody on his shoulders in odisha

చాలా బాధాకరమైన, హృదయ విదారక సంఘటన ఇది. ఓ తండ్రి తన కూతురు మృతదేహాన్ని భుజాన మోస్తూ 8 కిలోమీటర్లు నడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలోని అతంక్‌పూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ముకుంద్ అనే వ్యక్తి కూతురు బాబిత(7) తిత్లీ తుపానుతో వరదల్లో చిక్కుకుంది. అక్టోబర్ 11న వరదల్లో చిక్కుకున్నది. అప్పటి నుంచి ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. కానీ.. ఆమె ఆచూకి లభించలేదు. తర్వాత ఈనెల 17న బాబిత మృతదేహం లభ్యమైంది. కొండచరియలు మీద పడటంతోనే ఆ చిన్నారి బాబిత మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

ఇక.. బాబిత పోస్ట్ మార్టం కోసం ఆమె తండ్రి ముకుంద్ మృతదేహాన్ని కైన్‌పూర్ అనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేక.. వాహనదారులెవ్వరూ ముందుకురాకపోవడంతో తానే స్వయంగా భుజం మీద ఎత్తుకొని నడుచుకుంటూ తీసుకెళ్లాడు. పోస్ట్‌మార్టం చేస్తేనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని పోలీసులు చెప్పడంతో.. చేసేదేమి లేక.. భుజం మీద మోసుకుంటూ తీసుకెళ్లానని ముకుంద్ తెలిపాడు. కొంతమంది ముకుంద్ నడుచుకుంటూ వెళ్తుండగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న గజపతి జిల్లా కలెక్టర్ అనుమమ్ బాబిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్‌ను తక్షణ సాయంగా అందించాడు. మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లడం చాలా బాధాకరమని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కలెక్టర్ తెలిపాడు.