తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. కాగా.. గత కొంతకాలంగా ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో త్వరలో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల కాలంలో తీవ్ర అలజడి నెలకొంది. కాంగ్రెస్ కమిటీల నియామకం తర్వాత సీనియర్ నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. కమిటీల్లో తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని నిరసనకు దిగారు. బహిరంగంగానే తమ అసంతృప్తి గళాలు వినిపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌ను రంగంలో దింపింది.
వెంటనే రంగంలో దిగిన డిగ్గీరాజా సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ నేతల్లో రాజుకున్న అసంతృప్తికి అసలు కారణాలను వెలికితీశారు. దిగ్విజయ్ సింగ్‌కు అందిన సమాచారం ప్రకారం పార్టీలో అలజడికి కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్‌చార్జ్ గా ఉన్న మాణికం ఠాగూర్ అని తేలింది. చాలా మంది సీనియర్ నేతలు మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఆయనవల్లే చాలా సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఠాగూర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని చాలా మంది సీనియర్లు కోరారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను నియమించే పని కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయిన రణదీప్ సింగ్ సూర్జేవాలాకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.