ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 250 మంది ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 31 మంది సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగడం గమనించిన కొందరు వెంటనే సముద్రంలోకి దూకారు. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. అగ్నిప్రమాదంలో సుమారు 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో జరిగింది.
జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలీ పట్టణానికి ఓడ వెళ్తుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయని ప్రావిన్స్ గవర్నర్ జిమ్ హతమన్ తెలిపారు. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారని.. మంటల కారణంగా భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు.. అగ్నికీలల్లో చిక్కుకుని మరికొందరు మరణించారని వెల్లడించారు. దగ్ధమైన ఓడను బాసిలన్ తీరానికి చేర్చినట్లు చెప్పారు. ఓడ క్యాబిన్‌లోనే 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని.. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని వివరించారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని జిమ్ హతమన్ పేర్కొన్నారు.