మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్ చేసి, ప్రజాకోర్టు నిర్వహించి నలుగురిని హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుర్చేలి, మోటాపాల్ గ్రామాలకు చెందిన 25 మందిని మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వారిని ప్రజాకోర్టులో విచారించి నలుగురిని ప్రజాకోర్టులోనే గొంతుకోసి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఐదుగురిని విడిచిపెట్టి, మిగిలిన 16 మందిని వారి అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు.
ఇదిలా ఉండగా.. బీజాపూర్ జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులు ఓ గ్రామస్తుడిని ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేశారు. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుటాకేల్ గ్రామానికి సుమారు 20 మంది మావోయిస్టులు దసార్ రమణ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. మాట్లాడే పని ఉందని చెప్పి బయటకు రమ్మని పిలవడంతో రమణ నిరాకరించాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో మావోయిస్టులు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంటి ఎదుటే రమణను హత్య చేశారు.