అధికార వైసీపీలో నేతల దూకుడుకు అంతూదరీ లేదనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకులు విజృంభిస్తున్నారనే విమర్శలు కూడా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రతిపక్షాలు.. ప్రభుత్వ వ్యతిరేక మీడియాలోనూ కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. నాయకుల్లో మార్పు రావడం లేదు. పైగా పార్టీ అధిష్టానం కూడా హెచ్చరిస్తోంది. అయినా కూడా నాయకులు మారడం లేదు. పైగా మరింతగా నేతల దూకుడు పెరుగుతోంది. అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరులో ఓ యువ ఎమ్మెల్యే దూకుడుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.
గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన యువ నాయకుడు.. వైసీపీ ఎమ్మెల్యే.. వ్యవహారంపై జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చసాగుతోంది. ఇటీవల స్థానికంగా అధికారుల బదిలీ జరిగింది. ముఖ్యంగా వీఆర్వోలు.. తదితర ఉద్యోగులను కలెక్టర్ బదిలీ చేశారు. అదే సమయంలో పంచాయతీ అధికారులను కూడా బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఎమ్మెల్యే జోక్యం పెరిగింది. ఈ బదిలీ ప్రక్రియలో వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారికి వీఆర్‌వోలుగా పదోన్నతి లభించింది.
అయితే.. వీరిని అడ్డుకున్న సదరు ఎమ్మెల్యే.. తన హవాను కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఇది వివాదానికి దారి తీసింది. అయితే, ఇదేదో సాధారణంగా జరిగిపోయిందనుకుంటే పొరపాటే.. స్థానికంగా ఉన్నతహసీల్దార్‌లను కూడా సదరు నాయకుడు మేనేజ్ చేస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవైపు.. ఉద్యోగులను బెదిరిస్తూనే.. మరోవైపు ఉన్న తాధికారులను మేనేజ్ చేస్తున్న విషయం.. స్థానికంగా వైసీపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. దీనిపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఎక్కడికక్కడ.. నాయకులు .. వైసీపీ ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారు. అదే సమయంలో తనకు సీఎం దగ్గర పలుకుబడి ఉందని పేర్కొంటున్న సదరు ఎమ్మెల్యే.. కలెక్టర్ పై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా తన పీఠానికి ఎక్కడ ఎసరు వస్తుందనుకుంటున్నారో.. ఏమో.. సర్దుకు పోతున్నారట. మొత్తానికి ఈ ఎమ్మెల్యే విషయం మాత్రం చాలా చర్చకు వస్తుండడం గమనార్హం.
-Vuyyuru Subhash