మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు.
అయితే, రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌కు భారీ ఊరట లభించింది. మార్గదర్శి చిట్ ఫండ్‌లో అక్రమాలు జరిగాయంటూ రామోజీరావు, శైలజాకిరణ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది వారాలు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం… యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాఫ్తును ఎనిమిది వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి, సీఐడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.