ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య వివాహాలు పూర్తిగా తప్పు అని, ఇలాంటి వివాహాలకు ‘షరియత్ చట్టం’లో అనుమతి లేదు అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) తెలిపింది. ముస్లిం యువతీయవకులు ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తులనే వివాహం చేసుకోవాలని సూచించింది. ముస్లిం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే మతాంతర వివాహాలు చేసుకుంటున్నారనే చర్చ నేపథ్యంలో ఏఐఎంపీఎల్‌బీ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
ఇస్లాం సంప్రదాయక విద్యను తమ పిల్లలకు పూర్తిస్థాయిలో అందించకపోవడం వల్లే ముస్లిం యువత మతాంతర వివాహాలను చేసుకుంటున్నారని బోర్డు పేర్కొంది. తమ మతం వారిని మాత్రమే పెండ్లి చేసుకొనేలా ముస్లిం యువతీయువకులకు సర్దిచెప్పాలని అలీమ్స్, తల్లిదండ్రులను కోరింది. ముస్లిమేతరులను వివాహం చేసుకున్న తర్వాత ముస్లిం యువతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంది. ఇతర మతస్తులను వివాహం చేసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి బహిరంగ సమావేశాల్లో తరుచూ లెవనెత్తుతూ ఉండాలని ముస్లిం మత నాయకులను బోర్డు అభ్యర్థించింది.
అబ్బాయిలు, అమ్మాయిల మొబైల్ ఫోన్లపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పర్సనల్ లా బోర్డు సూచించింది. కో-ఎడ్యుకేషన్‌లో కాకుండా గర్ల్స్ స్కూళ్లలోనే అమ్మాయిలను చదివించాలని తల్లిదండ్రులను అభ్యర్థించింది. పాఠశాల సమయంలో మినహా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అమ్మాయిలను నిలువరించాలని తల్లిదండ్రులను కోరింది. ముస్లింను మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకొనేలా పిల్లలకు నచ్చజెప్పాలని పేర్కొంది.
యుక్త వయస్సు రాగానే తమ పిల్లలకు వివాహం జరిపించాలని ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదని, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కచ్చితంగా పాటించాలని తల్లిదండ్రులను బోర్డు అభ్యర్థించింది. మతాంతర వివాహాలకు ప్రధాన కారణం ఆలస్యంగా పెళ్లిళ్లు జరడమేనని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది.