ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప ధాటికి కనీసం 155 మంది మృతి చెందినట్లు అప్గాన్ అధికార మీడియా సంస్థ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య దాదాపు 250 వరకు ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వందల మంది గాయపడ్డారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అప్గాన్ లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.