సమ్మక్క, సారళమ్మ జాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి రెండేండ్లకు ఒక్కసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజులపాటు జరిగే జాతరకు అప్పుడే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నడుపుతున్నది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర కోసం టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నది. ఉదయం 7గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరుతాయి. సాయంత్రం 4గంటలకు మేడారం నుంచి హన్మకొండకు వస్తాయి. హన్మకొండ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 ఛార్జీలుగా నిర్ణయించింది.
గత జాతర కోసం 3532 బస్సులను ఆర్టీసీ వినియోగించింది. ఈసారి 3835 బస్సు సర్వీసులను నడపనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 51 బసు పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడరంలోని సమ్మక్క, సారళమ్మ దగ్గరికి, తిరిగి గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ఇందుకోసం 12,267 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు.
హైదరాబాద్ నుంచి మేడారం వరకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, అడ్వాన్స్ బుకింగ్ విషయమై ఇంకా స్పష్టత లేదు. హైదరాబాద్ టూ మేడారానికి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఉండే అవకాశం ఉన్నది. తిరుగు ప్రయాణంలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండకపోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని సిరోంచ నుంచి కాళేశ్వరం మీదుగా మేడారం వరకు అంతర్రాష్ట్ర సర్వీసులను సైతం ఆర్టీసీ నడపనున్నది. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా బస్సు సర్వీసులు నడుపనున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సామూహికంగా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు హన్మకొండ డిపో మేనేజర్ వి.మోహన్ రావు తెలిపారు. 30 మంది బృంధంగా జాతరకు వెళ్లాలనుకునే వారు సెల్:9949857692లో ముందుగా తెలియజేస్తే.. ప్రత్యేక బస్సులు మీరు ఉన్నచోటుకే వచ్చి ఎక్కించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇక పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65ల చార్జీలున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
కరోనాను దృష్ట్యా ఆర్టీసీ సిబ్బందికి 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేశారు. డిపో నుంచి బయల్దేరే ముందు బస్సులను శానిటైజ్ చేయనున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడంతోపాటు మాస్క్ ధరించి ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులు సైతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సూచిస్తున్నది.