గిరిజన కుంభమేళా… మేడారం జాతరకు మరో కొన్ని రోజులే సమయం ఉంది. ఈనెల 16 నుంచి 19 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర సాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గత నెల రోజులుగా భక్తులు జాతరకు వెళ్లి వస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా భారీగా సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే మేడారం భక్తులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. సాధారణంగా మేడానికి వచ్చే భక్తులు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఉండే చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. లక్నవరం చెరువు, కోటగుళ్లు, రామప్ప దేవాలయాలకు వెళ్లి వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం లక్నవరం చెరువుకు రావద్దని అధికారులు ఆాదేశాలు జారీ చేశారు. ఈనెల 20 వరకు సందర్శన నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. జాతర సమయంలో వేలాది వాహనాలు, లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో లక్నవరానికి అనుమతి ఇస్తే పార్కింగ్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతో.. ఆదాయం వచ్చినా పట్టించుకోకుండా సందర్శన నిలిపి వేసింది. మరోవైపు ఈనెల 20 వరకు రామప్ప సందర్శన కూడా నిలిపి వేస్తారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది.