మీడియా.. అంటే ప్రజల గొంతుక.. ప్రజల పక్షాన నిలిచే ఓ మాధ్యమం.. ప్రజా సమస్యలపై గళం విప్పే ఓ సాధనం.. కానీ.. ప్రస్తుత తరుణంలో మీడియా ఆ అర్థాన్నే మార్చేసింది. పనీ పాట లేని వారు చేసే పనుల గురించి.. అక్కరకు రాని పనికిమాలిన విషయాలపై వార్తలు రాస్తూ.. అభాసుపాలవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఓ వైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూసివేతకు గురయ్యే ప్రమాదంలో పడ్డాయి. ఎన్నో కోట్ల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగాలు పోయాయి. వలస కార్మికులు రోడ్డెక్కారు. కాళ్లకు చెప్పులు లేకుండా, ఎర్రని ఎండలో, పిల్లాపాపలతో, తింటానికి ఒక ముద్ద తిండి లేకుండా.. వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వాలు, పాలకులను మేల్కొల్పాల్సిన మీడియా చతికిలపడింది. పనికిమాలిన వార్తలను రాస్తూ.. ఇప్పటికే అథఃపాతాళంలో ఉన్న మీడియా.. మరింత లోతుకు దిగజారింది.
ఫలానా సెలబ్రిటీ దోశ వేశాడని.. ఆ హీరోయిన్ ఇంటి పని చేసిందని.. మరో నటుడు ఇంకేదో చేశాడని.. పోసుకోలు కబర్లు చెబుతూ మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. రాస్తున్నాయి. దేశానికి ఇవేవో పనికివచ్చే వార్తలైనట్లు, ఆ వార్తలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పైకి లేస్తుందన్నట్లు.. మసాలా దట్టించి వార్తలను వండి వారుస్తున్నాయి. నిజానికి ఇలాంటి వార్తలను రాసే మీడియా సంస్థలు సిగ్గు పడాలి. కనీస ప్రమాణాలు, విలువలను కూడా మర్చిపోయి.. పనికిమాలిన, పనిలేని వార్తలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నందుకు.. వారికి వారే ఆత్మనింద వేసుకోవాలి.
ఫలానా వలస కార్మికుడికి ఫలానా సెలబ్రిటీ ఏదో చేశాడని వార్త రాయండి.. వినేందుకు, చదివేందుకు ఎంత బాగుంటుంది.. ఆ వార్తతో కనీసం ఒక్క సెలబ్రిటీ అయినా ప్రేరణ పొంది పేదలకు సహాయం చేస్తే అంతకు మించి కావల్సిందేముంటుంది. ఆ విధంగా చేసేలా మీడియా సంస్థలే వార్తలను రాయాలి. ప్రసారం చేయాలి. అలా కాకుండా వారు పనిలేక చేసే పనుల గురించి వార్తలు రాస్తూ.. మీడియా సంస్థలు మరింత దిగజారుతున్నాయి. అలాంటి వార్తలు రాసేముందు ఆయా సంస్థలు ఒక్కసారి ఆలోచించాలి. ఈ తరహా వార్తలు ఇప్పుడు అవసరమా..? వీటి వల్ల ఏం ప్రయోజనం..? అనే ఆలోచన చేయాలి. అదేదీ లేకుండా.. పేరుగాంచిన మీడియా సంస్థలు కూడా దిక్కుమాలిన వార్తలతో తమ సైట్లను నింపేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మీడియా సంస్థల వైఖరిలో మార్పు రావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది..!