మీసాల గీత. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు.. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గతంలో గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ సామాజిక వర్గం అయిన తూర్పు కాపు వర్గానికి చెందిన గీత పార్టీ అధికారంలో ఉండగా కీలకంగా వ్యవహరించారు. అంత కీలకమైన నాయకురాలు.. ఇప్పుడు టీడీపీపైనా.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. ఇక పార్టీలో ఉండే పరిస్థితి కూడా నాకు కనిపించడం లేదని ఆమె తన అనుచరుల వద్ద చెబుతుండడం ఆసక్తిగా ఉంది. ఈ పరిస్థితిని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
మరి.. మీసాల గీత ఇంత ఫైర్ అవడానికి రీజనేంటి? ఎందుకుపార్టీపైనా.. టీడీపీ అధినేత పైనా.. అలకబూనారు.. అంటే.. వరుసగా ఆమెకు పార్టీ నుంచి ఎదురవుతున్న ఎదురు దెబ్బలే కారణంగా కనిపిస్తున్నాయి. పార్టీలో నానాటికీ ఆమెను ఒంటరిని చేస్తున్నారని.. ఆమె కష్టాన్ని కూడా గుర్తించడం లేదని చెబుతున్నారు. విజయనగరం టౌన్‌లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపు కులానికి చెందిన గీత.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 28 వేల ఓట్లే సాధించినా.. రాజకీయంగా మాత్రం గుర్తింపు పొందారు.
తర్వాత ప్రజారాజ్యాన్నికాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో టీడీపీ తరఫున టికెట్ సాధించి గెలుపు గుర్రం ఎక్కారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బొత్స దూకుడుకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ఆమెను వాడుకున్నారని అంటారు. అదే సమయంలో తూర్పు కాపు సామాజిక వర్గాన్ని టీడీపీకి చేరువ చేయడంలోనూ గీత కీలక పాత్ర పోషించారు. అలాంటి నాయకురాలికి .. గత ఏడాది ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు చంద్రబాబు. అదే సమయంలో అశోక్ గజపతి రాజు కుమార్తె అదితికి ఇచ్చారు. ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
అదితి ఓటమికి తూర్పు కాపుల ఆగ్రహమే కారణమనే ప్రచారం ఉంది. బీసీల్లో బలమైన తూర్పు కాపు వర్గం నుంచి మహిళా నేతగా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీతను పక్కన పెట్టడంతో ఆమె కుల సంఘాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఇవన్నీ అదితి ఓటమికి కారణమయ్యాయి. అప్పట్లో టికెట్ ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు.. ఇటీవల పార్టీలో పదవులు పందేరం చేసినప్పుడు కూడా గీతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆమె ఎందుకు నాకీ కష్టం అనుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురై.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇటీవల వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు .. ఆకులు పట్టుకున్న చందంగా.. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా అవకాశం ఇస్తామని రాయబారం పంపారు. అయితే. ఇంత ఘోరంగా అవమానించిన తర్వాత.. మీరిచ్చే పదవులు నాకవసరం లేదన్నట్టుగా గీత మాత్రం వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక, ఎమ్మెల్యే కోలగట్ట కూడా గీత వంటి నాయకురాలు పార్టీలోకి వస్తే.. తన వర్గం బలపడుతుందని భావిస్తూ.. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. చివరకు ఏం జరుగుతుందో ? చూడాలి.