పొంగళ్ల పండుగ..మగవాళ్లకు మాత్రమే ఆ గుడిలోకి ఎంట్రీ

-

ఆ ఆలయంలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ.. మగవాళ్లకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది.. పూజలు, పునస్కారాలు కూడా మగవారివే.. నైవేద్యం తయారీ, అభిషేకాలు వారివే.. చివరకు తీర్థప్రసాదాలు వారికే.. మహిళలది అక్కడ ప్రేక్షక పాత్ర మాత్రమే.. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం అక్కడ మగవారి హడావుడి అంతా ఇంతా కాదు.. ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామస్ధులు ఆచరిస్తున్న ఈ వింత ఆచారం సంక్రాంతి వచ్చినప్పుడల్లా చర్చలోకి వస్తుంది.

సాధారణంగా ఎక్కడైనా సరే గుళ్లు, ఆలయాల్లో దేవుళ్లు, దేవతలకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకునేది ఆడవాళ్లే.. కానీ ఇక్కడంతా రివర్స్ లో వుంటుంది యవ్వారం. జంబలకిడి పంబ టైపులో ఇక్కడ మగాళ్లు మాత్రమే పొంగుబాళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అనాధిగా వస్తున్న ఈ వింత ఆచారాన్ని కడపజిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ప్రతి యేడూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది.

కడపజిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయస్వామి ఆలయం ఇది. ప్రతియేటా ఇలా మగవారంతా కలిసి వరుసగా గరిటెలు చేతపట్టుకుని నలభీముల అవతారమెత్తుతారు. పేద్ద మాస్టర్ ఛెఫ్పుల్లా ఫోజులిస్తుంటారు. వంట చేయడం రాకపోయినా, ఆచారం కోసం తప్పక తిప్పలు పడుతుంటారు. ఏడాదికోమారు గ్రామంలో జరిగే ఈ పొంగళ్ల ఉత్సవంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు మిగతా ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. తిప్పాయపల్లెలోని సంజీవరాయస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది.

ఇక్కడ పేరుకే గానీ సంజీవరాయుడి విగ్రహమంటూ ఏమీ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం చెక్కారు. రాయిపై చెక్కిన శాసనాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ ఇక్కడి ప్రజలు ఆ రాయికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇది మగవాళ్లు మాత్రమే పూజించే గుడి ఎందుకయ్యిందనే దానికి ఇక్కడి వారికి ఓ లెక్కుంది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడని, పురుషులతో తప్ప స్త్రీలతో ఆ బ్రాహ్మణుడు అసలు మాట్లాడేవాడే కాదని ఇక్కడి గ్రామస్థులు చెబుతుంటారు. ఆయన ఆ గ్రామం నుంచి వెళ్లిపోతూ ఓ శిలను నాటి దానిపై లిపిని రాసి.. గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి గ్రామంలోని మగవారే పొంగుబాళ్లు పెట్టాలని చెప్పారట.. అప్పటి నుంచీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటను ఇక్కడి గ్రామస్తులు పాటిస్తూ వస్తున్నారు. రాను రాను అదే ఆ గ్రామ ఆచారంగా మారిపోయింది.

సంజీవరాయుడికి పొంగళ్లు ఖచ్ఛితంగా మగాళ్లే పెట్టాలని ఆలయ శాసనాల్లో ఉందని తిప్పాయపల్లె గ్రామస్తులు చెబుతారు. అందుకే తాతల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version