రాష్ట్రవ్యాప్తంగా భానుడు తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.గత కొన్ని రోజులుగా ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆదివారం నుంచి రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
జూన్ మూడో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గి వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. మే 30న రుతుపవనాలు కేరళను తాకాయని, జూన్ 5, 6 తేదీల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత రెండు రోజులుగా 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. శనివారం సాయంత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.