వావ్… ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్

0
16

టెక్నాలజీ ప్రపంచంలో ఓ సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతున్న ఆపిల్‌ను మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ చూపిన వేగవంతమైన ప్రగతి ఈ ఘనతను అందించిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ముగిసే సమయానికి మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.235 ట్రిలియన్ డాలర్లను తాకింది. అదే సమయంలో ఆపిల్ విలువ 3.07 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలవడంతో మైక్రోసాఫ్ట్ టాప్ గిర్డె పట్టింది. మరోవైపు, చిప్ దిగ్గజం ఎన్విడియా 2.76 ట్రిలియన్ విలువతో మూడో స్థానంలో నిలిచింది.

తాజాగా విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ భారీగా మెరుగైన ప్రదర్శన చూపింది. క్లౌడ్ సేవలతో పాటు ఏఐ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఈ అంశాలను ఇన్వెస్టర్లకు వివరించారు. మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇక ఆపిల్ విషయానికి వస్తే… ఐఫోన్ అమ్మకాల బలంతో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ, వాణిజ్య సుంకాలు పెద్ద ప్రతికూలతగా మారాయి. దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో సంస్థపై ప్రభావం పడింది. ఈ ఏడాది ఆపిల్ షేర్లు 18% వరకూ పడిపోయాయి. అదే సమయంలో టెస్లా కూడా 29% వరకు క్షీణతను నమోదు చేసింది.

మొత్తానికి, మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ రంగాల్లో పెట్టుబడులను పెంచుతూ దూసుకెళ్తుండగా… ఆపిల్ వాణిజ్య పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇది టెక్ ప్రపంచంలో అగ్రస్థాన మార్పుకు దారితీసిన కీలక అంశంగా నిలిచింది.