పహల్గామ్ ఉగ్రదాడిపైప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి గురించి అమెరికా ఇంటెలిజెన్స్‌కు పూర్తి సమాచారం ఉందని, దాడి చేసినవారు, వారి ఉద్దేశాలు, వెనుక ఉన్న శక్తుల వివరాలు అమెరికా నివేదికల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. టర్కీలోని సౌదీ ఎంబసీలో వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టును దారుణంగా హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ఈ హత్య వెనుక ఉన్నవారు, దాన్ని చేయించినవారు అందరికీ తెలుసని అన్నారు. ఈ ఘటనను ప్రపంచం ఖండించినప్పటికీ, ట్రంప్ మిలియన్ల డాలర్లు తీసుకొని సౌదీని కాపాడారని ఆరోపించారు. రాజకీయాల్లో డబ్బుతో కుట్రలు చేస్తూ, చట్టాలను కూడా కొనేస్తున్నారని విమర్శించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ, రష్యా ఆక్రమించిన 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ఇచ్చేయాలని ట్రంప్ సూచిస్తున్నారని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పాల్ అన్నారు. చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చేయాలా అని ప్రశ్నించారు. అలాగే, చైనా ఆక్రమించిన హాంకాంగ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ భూభాగాలను కూడా చైనాకే ఇచ్చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.