హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలలో 32 జిల్లాల నుంచి జాతీయ రహాదారులు వెళ్తున్నట్టు వెల్లడించారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
రహదారుల అనుసంధానం అన్నింటికంటే చాలా ముఖ్యమైనది అన్నారు. అందుకే వాజ్ పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తీసుకొచ్చిందని.. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. రోడ్ల నిర్మాణం పై రూ.లక్షల కోట్లు ఎందుకు అని ఆనాడు విమర్శించారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులుండేవి. పదేళ్ల తరువాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయి. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోంది. అనుసంధానం కోసం మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తామని.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించే రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.