ఆ వైసీపీ సీనియ‌ర్ మంత్రి ప‌ద‌వికి ఆ యువ మంత్రి అడ్డా..!

-

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. నేత‌ల భ‌విత‌కు ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌తిప‌క్ష పార్టీలే అడ్డు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. సొంత పార్టీ నాయ‌కులు కూడా అడ్డు ప‌డినా ప‌డొచ్చు. ఇది స‌హ‌జంగానే జ‌రిగే ప్ర‌క్రియ‌. గ‌తంలో టీడీపీలోనూ ఇలానే జ‌రిగింది. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంలోనూ అలానే జ‌రుగుతోంది. త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు ఎందుకు ద‌క్క‌డం లేద‌ని గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో చాలా మంది నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. మ‌రికొంద‌రు మేం సీనియ‌ర్లం.. అయినా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎందుకు త‌మ‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. అయితే, చివరాఖ‌రుకు తేలింది.. సామాజిక వ‌ర్గం స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌డం లేద‌నే..!

దీంతో స‌ద‌రు నాయ‌కులు న‌వ‌రంద్రాలు మూసుకుని త‌మ ప‌నులు తాము చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి స‌మీక‌ర‌ణే కుద‌ర‌క‌పోవ‌డంతో నాయ‌కులు ఉసూరు మంటున్నారు. ఈ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్న వాస్త‌వం కూడా. సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తున్నార‌నే రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని ఆయ‌న ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం వీరిని తీసుకున్నారు. అయితే, అతి త‌క్కువ మంది మాత్ర‌మే ఉంటే కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా ఇప్పుడు దిగులుతో రాజ‌కీయాలు చేయ‌లేక పోతున్నారు. అర‌రె.. మాలో మాకే పోటీ ఎక్కువ‌గా ఉంది! అంటూ త‌మ అనుచ‌రుల వ‌ద్ద వాపోతున్నారు.

ఇలాంటి వారిలో కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సార‌థి ఉన్నార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారులో ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించారు. అయితే, ఆయ‌న సామాజిక వ‌ర్గానికే చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ ప‌దవిని ద‌క్కించుకున్నారు. అయితే, ఆది నుంచి జ‌గ‌న్‌కు మంచి స‌పోర్ట‌ర్‌గాను, పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంలోనూ, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అప్ప‌టి మంత్రి పి. నారాయ‌ణ‌ను ఘోరంగా ఓడించ‌డంలోనూ అనిల్ స‌క్సెస్ కావ‌డం, ఫైర్ బ్రాండ్ మాదిరిగా ఆయ‌న టీడీపీపై విరుచుకుప‌డ‌డంలోనూ ముందున్నారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని కేటాయించారు.

ఇక‌, మ‌రోసారి మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ..దీనికి ఏడాది స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో అప్ప‌టికైనా కొలుసుకు అవ‌కాశం ద‌క్కుతుందా?  లేక‌.. అనిల్ దూకుడుకు మెచ్చి.. జ‌గ‌న్ మ‌ళ్లీ ఆయ‌న‌నే రెన్యువ‌ల్ చేస్తారా? అనే సంక‌ట స్థితి మాత్రం కొలుసును, ఆయ‌న వ‌ర్గాన్ని వెంటాడుతోంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు త‌క్కువ మందే ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన నాయ‌కుడుగా అనిల్‌.. కొలుసుకు గ‌ట్టి పోటీ ఇస్తున్నార‌నేది వాస్త‌వం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version