హైదరాబాద్‌లోని అలకనంద హాస్పిటల్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు.
కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా అన్నది ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటళ్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు.