సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన కేఎంసీ పీజీ వైద్య ప్రీతి కుటుంబ సభ్యులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంగిర్ని తండాలోని ప్రీతి స్వగృహానికి వెళ్లారు. ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీనియర్ వేధింపులు తట్టుకోలేక ప్రీతి హానికార ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ప్రాణాల కోసం పోరాడింది. ప్రీతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్ సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ప్రీతి తండ్రి ఆరోపించారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. ప్రస్తుతం సైఫ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తాను వేధించడం వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలిసింది.