మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు నమోదుకాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లు తెలిపారు. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే.
జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.