తెలంగాణలో పులుల అభయారణ్యం కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియలో మైసంపేట్, రాంపూర్ గ్రామ ప్రజలు గ్రామాల తరలింపునకు అంగీకరించారు. అయితే.. దీంట్లో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో ఈ రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు రూ. 21.40 కోట్ల పరిహారాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ చరిత్రలో మొదటిసారి పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు అధికారికంగా ప్రారంభమైందని ప్రకటించారు. పులులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మనుషులు అన్నిరకాల సౌకర్యాలు కోరుకున్నట్లే, అడవిలో అటవీ జంతువులు స్వేచ్ఛ గా బతికేందుకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో హరితహారం, అడవుల పెంపకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ దనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్యాకేజీ ప్రకారం గ్రామస్తులకు అన్ని వసతులు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్ మాట్ ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాం నాయక్, విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, సీసీఎఫ్ శర్వనన్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా అటవీ అధికారి హీరామత్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.