తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటిస్తున్న కేటీఆర్ బుధవారం దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. డెలాయిట్, జేసీబీ, హెచ్ఎస్‌బీసీ, రోల్స్ రాయిస్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, సహా మరిన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ వెంట తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆయా కంపెనీలకు వివరించారు. రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. ఇక పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు తెలంగాణలో సమృద్ధిగా నీరు, భూమి, విద్యుత్‌తో పాటు మానవ వనరులు ఉన్న విషయాన్ని తెలిపారు. భారత్‌లోని ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వలేనంత మేర ప్రోత్సాహకాలు తాము ఇస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు కేటీఆర్.